Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా మీడియా కంటే భారత్ మీడియా మెరుగన్న బైడెన్.. విరుచుకుపడుతున్న యూఎస్ మీడియా!

 US media riled by Biden comments criticising it during Modi meeting
  • అమెరికా మీడియాకు ఎప్పుడు ఏం అడగాలో తెలియదన్న బైడెన్
  • శుక్రవారం ద్వైపాక్షిక చర్చల సందర్భంగా వ్యాఖ్యలు
  • నిన్న బైడెన్ అధికార ప్రతినిధి పిసాకి వద్ద అభ్యంతరం వ్యక్తం చేసిన యూఎస్ మీడియా
  • మీడియా స్వేచ్ఛ విషయంలో తమకంటే తక్కువున్న భారత్ మీడియాతో పోలికేంటని ఆగ్రహం
ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ దేశపు మీడియాపై గుర్రుగా వున్నారు. సరైన ప్రశ్నలు వేయకుండా ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తున్నారన్న అభిప్రాయంతో ఆయన వున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయంపై అమెరికా మీడియాకు ఆయన చురక అంటిస్తున్నారు కూడా.

తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం సందర్భంగా సొంత దేశ మీడియాను ఉద్దేశించి బైడెన్ మరోసారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై అమెరికా మీడియా భగ్గుమంది. శుక్రవారం బైడెన్ మాట్లాడుతూ.. తమ సొంత దేశ మీడియా కంటే ఇండియన్ మీడియా చాలా మెరుగ్గా ప్రవర్తించిందని అన్నారు.

శ్వేతసౌధంలో మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల కోసం ఓవల్ కార్యాలయంలోకి వెళ్తూ.. వారు (మీడియా) ఏం చేయబోతున్నారో ప్రెస్‌లో చెప్పాలని అనుకుంటున్నానని బైడెన్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ ‘‘అమెరికా మీడియాతో పోలిస్తే భారత మీడియా చాలా మెరుగ్గా ప్రవర్తించింది. మీరు ఓకే అంటే కనుక మనం వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉందాం. ఎందుకంటే వారికి ఎప్పుడు ఏం అడగాలో తెలియదు’’ అంటూ మీడియాకు దొరికిపోయారు.  
 
ఇండియా మీడియా ఎదుట తమ పరువును బైడెన్ మంటగలిపారంటూ గుర్రుగా ఉన్న యూఎస్ మీడియా నిన్న బైడెన్ అధికార ప్రతినిధి జెన్ పిసాకి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆమె ఈ విషయాన్ని తేలిగ్గా తీసిపడేశారు. బైడెన్ ఉద్దేశం అదికాదని కొట్టిపడేస్తూ అధ్యక్షుడికి అండగా నిలిచారు. అంతేకాదు, అమెరికా మీడియా ప్రతినిధులు సంబంధం లేని ప్రశ్నలు అడిగిన విషయం తన దృష్టికి కూడా వచ్చిందన్నారు.

మరో రిపోర్టర్ మాట్లాడుతూ.. ఇండియా-అమెరికా మీడియా మధ్య పోలిక తీసుకురావడాన్ని తప్పుబట్టారు. మీడియా స్వేచ్ఛ విషయంలో భారత మీడియా 142వ ర్యాంకులో ఉందని, అలాంటి మీడియాతో తమకు పోలికేంటని మండిపడ్డారు. అయితే, పిసాకి మాత్రం బైడెన్ వ్యాఖ్యలను సమర్థించారు. అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నోసార్లు మీడియాతో మాట్లాడారని గుర్తు చేశారు. నేటితో సహా దాదాపు 140 సార్లు బైడెన్ మీడియాతో మాట్లాడారని పేర్కొన్నారు. మీడియా పాత్రను, మీడియా స్వేచ్ఛను బైడెన్ గౌరవిస్తారని పిసాకి వివరించారు. కాగా, మీడియా స్వేచ్ఛలో అమెరికా 44వ స్థానంలో ఉంది. బుర్కినా ఫాసో, గబోన్ వంటి చిన్న దేశాల కంటే స్వేచ్ఛ విషయంలో అమెరికా దిగువన ఉండడం గమనార్హం.
America
India
Media
Joe Biden
Narendra Modi

More Telugu News